పూనాచ్చి

 పూనాచ్చి. 

- పెరుమాళ్ మురుగన్.


ఇది అనిల్ బత్తుల గారి పోస్ట్ చూసి నేను చదివిన పెరుమాళ్ గారి రెండవ నవల. 


ఒక వూరిలో ముసలివాడు, ముసలమ్మా ఒక చిన్న గుడిసె లో, కొన్ని మేకలు ఒక దూడని పెట్టుకుని బతుకుతూ ఉంటారు. కొండ మీద మేకల్ని మేపుకుంటున్న ముసలివాడికి, ఒక బాటసారి బుల్లి మేకపిల్లని ఇచ్చి వెళ్లిపోతాడు. అదే పూనాచ్చి. చిన్న పిల్లి పిల్లలా ఉన్న పూనాచ్చి ని ముసలమ్మ ప్రేమ గా పెంచుకుంటుంది. తోటి మేకలతో ఆటలు ఆడుతూ పూనాచ్చి పెరిగి పెద్దది అవుతుంది. ముసలమ్మ తో పాటు ఆమె కూతురు ఇంటికి వెళ్లిన పూనాచ్చి అక్కడ పూవన్ ని ప్రేమిస్తుంది. అవును మేకపిల్ల ప్రేమిస్తుంది. ఇక్కడిదాకా కథ చాల బాగుంది అందరి చిన్నతనం లా.


ముసలమ్మ కూతురు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పూవన్ ని వదిలి వెళ్లలేక పూనాచ్చి చాల ఏడుస్తుంది. ఇంతలో తోటి మేకపిల్ల ఉళుమ్బన్ మరణం, ఆ ఎడబాటు విషాదాన్ని మరిపిస్తుంది. 7 పిల్లలని ఒకేసారి కన్నపూనాచ్చి ఒక వింత గా ఆ వూరు లో అందరిని ఆకర్షిస్తుంది. కానీ బలహీనం గా ఉన్న ముసలమ్మ కి, పూనాచ్చి కి ఆ పిల్లలని పెంచడం చాల కష్టం అవుతుంది. కష్టానికి అలవాటు పడి పిల్లలతో ఆడుతున్న సమయం లోనే ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లల్ని కొనుక్కుని వెళ్లిపోతారు. అలా తన మొదటి కాన్పు పిల్లలకి దూరం అవుతుంది పూనాచ్చి. 


తర్వాత సంవత్సరం తిరణాల కి ముసలమ్మ కూతురు ఇంటికి వెళ్లిన పూనాచ్చి, పూవన్ వల్ల తల్లి అవుతుంది. ఈసారి తన పిల్లలు కరువు కి బలి అవుతారు. మూడవ కాన్పు లో పిల్లల్ని కనలేక పూనాచ్చి మరణిస్తుంది. ఏంటో నాకు వెంటనే హమ్మయ్య అనిపించింది.  


సిద్దాంతాలు, నీతి నియమాలు అన్ని బాగున్నవాళ్లకే. పేదరికం, కరువు మనుషుల్ని, వారి నీతి నియమాలు, నమ్మకాలని నిర్దాక్షిణ్యం గా బద్దలు కొడుతుంది. అదే రచయిత చెప్పారు అనిపించింది. అదే పూనాచ్చి కూడా మనని ప్రశ్నిస్తున్నట్టుగా నవల సాగుతూ ఉంటుంది. పుస్తకం పైన ఉన్న పూనాచి బొమ్మ కూడా మనని అమాయకం గా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. ఉళుమ్బన్  చనిపోయినప్పుడు ముసలమ్మ, సొంత బిడ్డలా పెంచాను బిడ్డ మాంసం కూర తినలేను అంటుంది కానీ అదే ముసలి దంపతులు కరువు కష్టం లో, ఎవరు కొనలేని పరిస్థితుల్లో, పెంచలేక పూనాచ్చి పిల్లలను ఒక్కొక్కటి గా తినేస్తారు.  


మేకల పేర్లు తప్ప ఎక్కడా  కూడా నవల తమిళ అనువాదం అనిపించకుండా అనువదించిన  గౌరీ కృపానందన్ గారికి ధన్యవాదాలు. ఇది తమిళ కథ కాదు కరువు కోరల్లో చిక్కుకున్న మనుషులు ఉన్న ప్రతి ఊరి కథ. కష్టం, పరిస్థితులు ఎక్కువ తక్కువ అంతే.


చదవండి. ఇంకా ఎదో ఒక మూల మానవత్వం ఇంకా ఉంటే ఖచ్చితం గా ఏడుపు తెప్పించే నవల. ఏడుపు రాకపోతే తప్పులేదు మన మనసులు సున్నితత్వం మరచి చాల కాలం అయింది.



Comments

Popular posts from this blog